Jagdeep Dhankhar | పార్లమెంట్ పనుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ చేసే చట్టాలపై సుప్రీంకోర్టు ముద్ర వేస్తేనే చట్టంగా తయారవుతుందా? అని ప్రశ్నించారు. ఇలాంటప్పుడు పార్లమెంట్ చట్టాలు చేయడం ఎందుకన్నారు. బుధవారం జైపూర్‌లో 83 వ అసెంబ్లీ స్పీకర్ల జాతీయ సదస్సు ప్రారంభ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ సీపీ జోషి తదితరులు హాజరయ్యారు.ఈ సమావేశాలు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. ఈ సదస్సులో మాట్లాడిన ఓం బిర్లా, అశోక్ గెహ్లాట్ కూడా కోర్టుల జోక్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. వాటిని సుప్రీంకోర్టు రద్దు చేస్తుంది. పార్లమెంటు చేసిన చట్టం కోర్టు ఆమోదం పొందినప్పుడే చట్టం అవుతుందా? 1973 లో తప్పుడు సంప్రదాయం మొదలైంది. కేశవానంద భారతి కేసులో పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించగలదు. కానీ దాని ప్రాథమిక నిర్మాణాన్ని కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ తీర్పుతో తాను ఏకీభవించడంలేదు. రాజ్యాంగంలో మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉన్నది. పార్లమెంట్ తన నిర్ణయాన్ని ఇతర సంస్థల ద్వారా సమీక్షించేందుకు అనుమతించవచ్చా?’ అని ప్రశ్నించారు. పార్లమెంట్ చేసిన ఏ చట్టాన్నయినా ఏ సంస్థ అయినా ఏ కారణంతో చెల్లుబాటయ్యేలా చేస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, అలాంటి సందర్భాల్లో మనది ప్రజాస్వామ్య దేశం అని చెప్పడం కష్టంగా ఉంటుదని ధన్ఖర్ వ్యాఖ్యానించారు.
న్యాయవ్యవస్థ కూడా డెకోరమ్‌ను పాటించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. తమకు ఇచ్చిన రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించుకోవాలని న్యాయవ్యవస్థ భావిస్తున్నాదని, అదే సమయంలో మీ అధికారాలను సమతులం చేసుకోండన్నారు. ఇదే మన చట్టసభల స్పీకర్లకు కావాల్సిందని చెప్పారు. కొన్నిసార్లు న్యాయవ్యవస్థతో విబేధాలు వస్తున్నాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. న్యాయవ్యవస్థ మా పనిలో జోక్యం చేసుకుంటున్నదని విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఇందిరాగాంధీ రద్దు చేసిన ప్రైవీ పర్సులను తర్వాత న్యాయవ్యవస్థ కూడా రద్దు చేసిన విషయం గుర్తుచేశారు. ఆ తర్వాత కాలంలో జాతీయీకరణ నుంచి అన్ని నిర్ణయాలకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని పేర్కొన్నారు.