జమ్మూ: అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra) కోసం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. బ్యాంకు బ్రాంచీల వద్ద రిజిస్ట్రేషన్ కోసం జనం క్యూకట్టారు. పవిత్ర అమరనాథ్ యాత్రకు వెళ్లాలనుకున్న భక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ యేడాది ఆ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభంకానున్నది. రెండు మార్గాల్లో యాత్ర జరగనున్నది. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ రూట్లో 48 కిలోమీటర్ల దూరంతో ఒకటి, మరొకటి కేవలం 14 కిలోమీటర్ల దూరం ఉండే గందేర్బల్ జిల్లాలోని బల్తాల్ రూట్లో భక్తులు ప్రయాణిస్తుంటారు. ఆగస్టు 9వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగియనున్నది. ఆ రోజున రక్షా బంధనం పండుగ కూడా ఉన్నది.
యాత్రికుల రిజిష్ట్రేషన్ కోసం శ్రీ అమర్నాథ్జీ ఆలయ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ కోసం మొత్తం 540 బ్యాంకు బ్రాంచీల్లో అవకాశం కల్పించారు. దీంతో పాటు బోర్డు వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు కూడా చేసుకోవచ్చు. 13 ఏళ్ల లోపు, 75 ఏళ్లు దాటిన వారికి రిజిస్ట్రేషన్ చేయరు. ఇక ఆరువారాల గర్భిణికి కూడా ఆ అవకాశం ఇవ్వడం లేదు. గత ఏడాది సుమారు 5.12 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. ఇది గత 12 ఏళ్లలో అత్యధికం కావడం విశేషం.