హైదరాబాద్ : కేసీఆర్ను తాము తెలంగాణ తొలి సీఎంగా మాత్రమే చూడటం లేదని, ఆయన గొప్ప ఉద్యమకారుడని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను మానవ మృగమని అనడం దారుణమని, సీఎం రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో లేడని, రేవంత్ కేసీఆర్పై వాడిన భాషను ఒక ఉద్యమకారుడిగా తాను ఖండిస్తున్నానని అన్నారు.
రేవంత్ రెడ్డి కొందరు ఉద్యమకారులను అడ్డుపెట్టుకుని కేసీఆర్పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని దేవీప్రసాద్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో లోపాలు ఉంటే ప్రశ్నించవచ్చని, కానీ ఉద్యమకారుడు కేసీఆర్ గురించి తెలంగాణ గడ్డ మీద అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని అన్నారు. కేసీఆర్ను సీఎం తిడుతుంటే చప్పట్లు కొట్టేవారు ఉద్యమకారులు కానే కారని వ్యాఖ్యానించారు.
ఉస్మానియా అనేక భావజాలాలు వికసిల్లిన యూనివర్సిటీ అని, అలాంటి యూనివర్సిటీ వేదికగా సీఎం పిచ్చి మాటలు మాట్లాడతారా..? అని దేవీప్రసాద్ మండిపడ్డారు. యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు చూసి కూడా సీఎం రేవంత్ రెడ్డికి వారిని ఆదుకోవాలని లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి బీఆర్ఎస్ ప్రశ్నించడం ఆపదని అన్నారు.