ముంబై: మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఎట్టకేలకు శనివారం శాఖల కేటాయింపు ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు కీలకమైన హోం శాఖ కూడా లభించగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆర్థిక, ప్రణాళిక శాఖలు లభించాయి.
ఇక శివసేన నాయకుడు, మాజీ సీఎం ఏక్నాథ్ షిండేకు తీవ్ర నిరాశ ఎదురైంది. హోంశాఖపై ఆయన పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. డిప్యూటీ సీఎంతో పాటు ఆయనకు పట్టణాభివృద్ధి, హౌసింగ్, పబ్లిక్ వర్క్స్ శాఖలు దక్కాయి. హోం శాఖతోపాటు ఫడ్నవీస్ కీలక శాఖలైన ఇంధనం, న్యాయ, సాధారణ పరిపాలన, సమాచార, ప్రచార శాఖలను తన వద్దనే ఉంచుకున్నారు. ఆర్థిక, ప్రణాళిక శాఖలతోపాటు ఎక్సైజ్ శాఖను అజిత్ పవార్‌కు కేటాయించారు.