ముంబై, జూన్ 8: ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో ఒక పక్క పోరాడుతూనే నీట్లో 720కి 715 మార్కులు సాధించిన ముంబైలోని ఘట్కోపర్కు చెందిన మౌలిక్ పటేల్ అనే విద్యార్థి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్‌లో మౌలిక్ 11వ తరగతి చదువుతుండగా, క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు బయటపడటంతో దానికి చికిత్స తీసుకోవడం ప్రారంభించాడు. క్లిష్టతరమైన 23 కెమోథెరపీ, 32 రేడియేషన్ ట్రీట్మెంట్లు తీసుకున్నాడు. దీంతో కాలేజీకి వెళ్లడానికి వీలుపడేది కాదు. అయినా చికిత్సలో తీవ్ర బాధ అనుభవిస్తూనే ఆన్లైన్లో కోచింగ్ తీసుకుని మహారాష్ట్ర బోర్డ్ పరీక్షల్లో 94.67 శాతం సాధించాడు. మరోపక్క ఎన్నో లక్షల మంది హాజరయ్యే నీట్ కూడా రాసి అందులో 720కి 715 మార్కులు పొందాడు. పట్టుదల, కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చునని, క్యాన్సర్ తనను బాధించినా నీట్లో ఎలాగైనా విజయం సాధించాలని చదివి ఒక పక్క క్యాన్సర్‌ను జయించడమే కాక, చదువులో తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టు మౌలిక్ పటేల్ తెలిపాడు.