బెంగళూరు, డిసెంబర్ 7: అధికార పంపిణీ ఒప్పందంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట మార్చారు. అలాంటి ఒప్పందం ఏదీ లేదని, దీని గురించి ఎవరూ మాట్లాడొద్దని శనివారం పేర్కొన్నారు. ఎన్నికల ముందే అధికార పంపిణీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, తనకు మధ్య ఒప్పందం ఉందని ఇటీవల ఓ చానల్‌తో డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.
ఇది కర్ణాటక కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. ఇలాంటి ఒప్పందం ఏదీ లేదని, అధిష్ఠానం నిర్ణయాన్నే తాను పాటిస్తానని సిద్ధరామయ్య కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వెనకడుగు వేశారు. ‘అధికార పంపిణీ ఒప్పందం గురించి ఎవరూ మాట్లాడొద్దు. ఇలాంటి ఫార్ములా ఏదీ లేదు. ఒక అవగాహనతో మేమిద్దరం పని చేస్తున్నాం. ఇదే విషయాన్ని నేను టీవీ చానల్‌కు చెప్పాను’ అని డీకే శివకుమార్ పేర్కొన్నారు.