Dengue : దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్‌లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నవంబర్‌లో కూడా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో మొత్తం 2,431 మంది డెంగీ బారినపడగా.. ఈ నెల తొలి 10 రోజుల్లోనే ఆ సంఖ్య 472కు చేరింది. దాంతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసుల విస్తృతి నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కూడా అప్రమత్తమైంది. పరిస్థితిని అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది.
ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 4,533 డెంగీ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌కు చెందిన వెక్టర్ బార్న్ డిసీజెస్ రిపోర్టు తెలిపింది. 2023లో కూడా ఢిల్లీలో మొత్తం 9,266 డెంగీ కేసులు నమోదయ్యాయని, 19 మంది మరణించారని వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు డెంగీ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ అక్టోబర్ నుంచి వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాది నజఫ్‌గఢ్, దక్షిణ ఢిల్లీ, షాదరా (నార్త్), కరోల్ బాగ్, సెంట్రల్ ఢిల్లీల్లో డెంగీ కేసులు చాలా ఎక్కువగా నమోదయ్యాయి. డెంగీ కేసులు భారీగా ఉండగా.. మలేరియా, చికున్ గున్యా కేసులు మాత్రం తక్కువగా ఉండటం సంతోషించదగ్గ పరిణామం. ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 728 మలేరియా కేసులు, 172 చికున్ గున్యా కేసులు నమోదయ్యాయి.