PM Modi : జానాభా మార్పు (demographic shift) తో ప్రజాస్వామ్యం (Democracy) దెబ్బతింటున్నదని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ వస్తున్నదని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగుతున్న ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.100 నాణెం, పోస్టల్ స్టాంప్ (Postal stamp) ను ఆయన విడుదల చేశారు.
అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆరెస్సెస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆరెస్సెస్ కృషి చేస్తోందన్నారు. అసత్యంపై సత్యం, అన్యాయంపై న్యాయం, అధర్మంపై ధర్మం గెలుస్తుందని చెప్పారు. నది తన ప్రవాహంతో అనేక భూముల్లో పచ్చదనం పెంచుతోందని, నదీ ప్రవాహంలా ఆరెస్సెఎస్ కూడా ప్రజలకు సేవ చేస్తోందని అన్నారు. విద్య కోసం, వైద్యం కోసం, రైతుల కోసం అనేక విధాలుగా సంఘ్ సేవలు అందిస్తోందని చెప్పారు.
మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఆరెస్సెస్ నిరంతరం కృషి చేస్తుందని ప్రధాని అన్నారు. ఆరెస్సెస్ చేసే ప్రతి పనిలో నేషన్ ఫస్ట్ అనేది కన్పిస్తోందని చెప్పారు. గతంలో సంస్థ స్ఫూర్తిని అణచివేసేందుకు తప్పుడు కేసులు బనాయించడం, నిషేధించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయని, అయినా ఆరెస్సెస్ అన్నింటినీ తట్టుకొని నిలబడిందని ప్రధాని మోదీ తెలిపారు. అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ సంస్థ నేటికీ బలంగా నిలబడిందన్నారు.
అరెస్సెస్ దేశానికి, సమాజానికి అవిశ్రాంతంగా సేవ చేస్తోందని ప్రధాని చెప్పారు. వారి ప్రయత్నాలు దేశంపై ఉన్న భక్తి, త్యాగం, నిబద్దతకు నిదర్శనమని పొగిడారు. తాజాగా విడుదల చేసిన రూ.100 నాణెంపై ఓవైపు జాతీయచిహ్నం, మరోవైపు భారతమాత చిత్రం ఉంటుందన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన కరెన్సీపై భరతమాత ఉండటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.