గురువారం 21 జనవరి 2021
National - Dec 01, 2020 , 01:36:28

వెనక్కి తగ్గం!

వెనక్కి తగ్గం!

  • నిర్ణయాత్మక పోరుకు సిద్ధపడే ఢిల్లీకి వచ్చాం
  • మోదీ సర్కార్‌ మా ‘మన్‌ కీ బాత్‌' వినాలి
  • షరతులు లేకుండా డిమాండ్లను పరిష్కరించాలి
  • లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు
  • కేంద్ర ప్రభుత్వానికి రైతన్నల అల్టిమేటం
  • నేడు రైతు సంఘాలతో కేంద్రం చర్చలు!

న్యూఢిల్లీ, నవంబర్‌ 30: శాంతియుతంగా మొదలైన ఉద్యమం.. ప్రభుత్వ అణచివేతతో ఉగ్రరూపం దాలుస్తున్నది. ఎముకలు కొరుకే చలిని సైతం లెక్కచేయకుండా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేపడుతున్న ‘చలో ఢిల్లీ’ నిరసనలు సోమవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. తమ డిమాండ్లపై రాజీపడే ప్రసక్తేలేదని, మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకూ ఉద్యమాన్ని ఆపబోమని రైతులు స్పష్టం చేశారు. ‘నిర్ణయాత్మక పోరు’కు సిద్ధపడే హస్తినబాట పట్టామని, వెనక్కితగ్గబోమని ఘంటాపథంగా చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనడానికి సిద్ధమేనన్నారు. మరోవైపు, ఢిల్లీ శివారుల్లోని ఘాజీపూర్‌, ఘజియాబాద్‌ సరిహద్దుల్లోనూ వేలాది మంది రైతులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఉద్యమకారులను అడ్డుకోవడానికి పోలీసులు కాంక్రీటు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

రాజీపడబోం

ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనలకు సంబంధించి సింఘు సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధులు సోమవారం మాట్లాడారు. తమ డిమాండ్లపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని చెప్పారు. నిర్ణయాత్మక పోరాటానికి సిద్ధపడే ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. తమ ‘మన్‌ కీ బాత్‌' (మనసులోని మాట)ను ప్రధాని మోదీ వినాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను పెడచెవిన పెట్టొద్దని.. అలా చేస్తే అధికార సర్కార్‌ తప్పక భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  మరోవైపు, వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు వదంతులను వ్యాపింపజేస్తూ.. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. 

వెల్లివిరుస్తున్న దాతృత్వం

కేంద్రప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా రైతులు చేపడుతున్న నిరసనలకు సర్వత్రా మద్దతు లభిస్తున్నది. రైతుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సోషల్‌ మీడియాలో ప్రచారం హోరెత్తుతున్నది. తీవ్రమైన చలిలో, ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై బైఠాయించిన అన్నదాతలకు స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, స్థానికులు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. గురుగ్రామ్‌కు చెందిన ఇద్దరు వైద్యులు సింఘు సరిహద్దుల్లో సొంతంగా మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురైన ఉద్యమకారులకు, వృద్ధ రైతులకు అవసరమైన మందులను ఇచ్చారు. 

కేంద్రానికి ట్యాక్సీ యూనియన్ల అల్టిమేటం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతు పెరుగుతున్నది. రైతుల డిమాండ్లను పరిష్కరించకపోతే, నిరవధిక సమ్మెకు దిగుతామని ఢిల్లీలోని ప్రైవేట్‌ ట్యాక్సీ యూనియన్లు కేంద్రానికి రెండు రోజుల అల్టిమేటం జారీ చేశాయి. రాజధానిలో క్యాబ్స్‌, ట్యాక్సీలు, ఆటో లు, లారీలను నడుపబోమని హెచ్చరించాయి.

నేడు చర్చలకు ఆహ్వానం

వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న అభ్యంతరాలపై  మంగళవారం చర్చించేందుకు రైతు సంఘాల నాయకులను ఆహ్వానించినట్టు  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు.

కరోనా కంటే ఈ చట్టాలే మాకు ప్రమాదకరం

కరోనా వ్యాప్తి కొనసాగుతున్న సమయంలో భౌతిక దూరం, ముఖానికి మాస్కులు వంటి నియమాలను పాటించకుండా వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనల్లో పాల్గొనడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలు వైరస్‌ సూపర్‌ స్ప్రెడర్‌గా (మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందడం) మారే అవకాశమున్నదని, ఇది వాళ్ల ప్రాణాలకు ముప్పుగా మారొచ్చని హెచ్చరించారు. కరోనా సోకినప్పటికీ తాము బతుకగలమని, అయితే, తమ నోటి దగ్గరి కూడును లాక్కునే ఈ చట్టాలు అమలైతేనే తాము బతుకలేమని రైతు సంఘం నాయకుడు గుర్మీత్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కంటే వ్యవసాయ చట్టాలే అత్యంత ప్రమాదకరమని విమర్శించారు.ఎన్డీఏ నుంచి బయటకొస్తాం: ఆర్‌ఎల్పీ 

రైతులకు నష్టం కలిగించేలా ఉన్న వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ మిత్ర పక్షం, ఎన్డీఏ కూటమిలోని రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్పీ) మోదీ సర్కార్‌ను డిమాండ్‌ చేసింది. అలా కాని పక్షంలో తాము కూటమి నుంచి వైదొలుగుతామని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ హనుమాన్‌ బేనీవాల్‌ హెచ్చరించారు. గడ్డకట్టుకుపోయే చలిలో రైతులపై జల ఫిరంగులను ప్రయోగించడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని శివసేన విమర్శించింది.

ఆగిన మరో గుండె 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో మరో అన్నదాత గుండె ఆగిపోయింది. పంజాబ్‌లోని లుధియానా జిల్లాకు చెందిన గజ్జన్‌ సింగ్‌ అనే రైతు తీవ్రమైన చలికి తట్టుకోలేక, హార్ట్‌ ఎటాక్‌తో ఆదివారం రాత్రి టిక్రీ సరిహద్దుల్లో మరణించారు. నిరసనలు ప్రారంభమైన ఐదురోజుల్లో ఇది రెండో రైతు మరణం.


logo