Vindhya statehood | భోపాల్ : ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ‘వింధ్య’ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మరోసారి ఊపందుకొన్నది. బీజేపీ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేనే తిరుగుబావుటా ఎగురవేశారు. వింధ్య రీజియన్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా సాధన కోసం స్థానిక ప్రజలు ప్రారంభించిన రాజకీయ పార్టీ వింధ్య జనతా పార్టీ(వీజేపీ)కి తాను నేతృత్వం వహిస్తానని బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి శనివారం పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వింధ్య రీజియన్‌లో 30 అసెంబ్లీ నియోజకవర్గాలతో సహా 43 స్థానాల్లో పోటీచేస్తామని తెలిపారు.
వింధ్య రీజియన్‌లోని 30 సీట్లనూ గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. వింధ్య ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని, వింధ్యకు రాష్ట్ర హోదా ఇవ్వాలని 2004 నుంచి డిమాండ్ చేస్తున్నానని అన్నారు. రాజకీయ పార్టీగా వీజేపీ గతవారం రిజిస్టర్ అయిందని, సభ్యత్వ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. వింధ్య ప్రాంతంలో బ్రాహ్మణ నేతగా ఉన్న నారాయణ్ త్రిపాఠి.. 2014లో బీజేపీలో చేరారు. సత్నా జిల్లాలోని మైహర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.