కోల్‌కతా: ఓటర్ల పేర్లను ఎలక్టోరల్ జాబితా నుంచి తొలగించడం కోసమే కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఆరోపించారు. జాతీయ పౌరుల రిజిస్టర్(ఎన్ఆర్సీ) అమలు కోసం చేస్తున్న కుట్రగా ఈ బిల్లులను ఆమె అభివర్ణించారు. కూచ్‌బెహర్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులను కలిపి ప్రవేశపెట్టడం ద్వారా దేశాన్ని విభజించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆమె ఆరోపించారు. గతంలోనే ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎందుకు అమలు చేయలేదని కేంద్రాన్ని నిలదీశారు. తమ పార్టీ ఎంపీల్లో 37 శాతం మహిళలేనని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల ఓటర్లకు ‘కార్డులు’ పంచడంపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.