Bomb Threats | దేశరాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. నిన్న రెండు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ కళాశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కళాశాలకు (St Stephens College) మంగళవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. అదేవిధంగా ద్వారక ప్రాంతంలోని సెయింట్ థామస్ పాఠశాలకు (St Thomas School) కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల, పాఠశాల యాజమాన్యాలు ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను ఖాళీ చేయించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక శాఖ బృందం, ప్రత్యేక సిబ్బంది సహా ఎమర్జెన్సీ సర్వీసెస్ టీమ్లు హుటాహుటిన ఆ రెండు ప్రదేశాలకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఇప్పటి వరకూ ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, సోమవారం కూడా ఢిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని చాణక్యపురి (Chanakyapuri)లో గల నేవీ స్కూల్ (Navy Children School), ద్వారక (Dwarka) ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాలకు (CRPF Public School) సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు పాఠశాలలకు ఫోన్ చేసిన ఆగంతకులు స్కూల్స్ ఆవరణలో బాంబులు పెట్టినట్లు బెదిరించారు. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆయా పాఠశాలల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదంతా బూటకపు బెదిరింపులుగా తేల్చారు. ఇలా వరుస బెదిరింపులతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
X Down | ఎక్స్ సేవల్లో మళ్లీ అంతరాయం.. ప్రపంచ వ్యాప్తంగా లాగిన్లో సమస్యలు
Tesla | భారత్లో టెస్లా తొలి షోరూం ప్రారంభం