న్యూఢిల్లీ: బైక్ పార్కింగ్ విషయంలో దంపతులు, పొరుగువారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో పొరుగున నివసించే వ్యక్తులు ఆ జంటపై కత్తితో దాడి చేశారు. కత్తిపోటు వల్ల మహిళ మరణించగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. (Woman Stabbed To Death) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. భార్యాభర్తలైన ఆరతి, విక్కీ బిందాపూర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోడ్డుపై బైక్ పార్కింగ్ విషయంలో ఆ దంపతులకు, పొరుగువారితో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో పొరుగింటి వ్యక్తులు కత్తితో వారిపై దాడి చేసి పొడిచారు. ఆరతి, ఆమె భర్త విక్కీ తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, గాయపడిన ఆ దంపతులను దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆరతి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కత్తిపోట్లకు గురైన ఆమె భర్త విక్కీని మెరుగైన చికిత్స కోసం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఆరతి తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పొరుగింటికి చెందిన 40 ఏళ్ల పప్పు, మైనర్ బాలుడిని నిందితులుగా గుర్తించారు. పప్పును అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న బాలుడిని అదుపులోకి తీసుకునేందుకు అతడి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.