Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ సీఎంకు పలు షరతులు విధించింది. కేసుకు సంబంధించి వ్యాఖ్యలు చేయొద్దని.. సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని.. అధికార దస్త్రాలపై సంతకాలు చేయొద్దని ఆదేశించింది. రూ.10లక్షల బాండ్లు, ఇద్దరి పూచీకత్తుతో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే, కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర
సచ్‌దేవా కీలక వ్యాఖ్యలు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను సుప్రీంకోర్టు చట్టబద్ధమైందని.. ఆయనపై అభియోగాలు చెల్లుబాటు అవుతాయని చెప్పిందన్నారు. కేజ్రీవాల్‌కి షరతులతో కూడిన బెయిల్ రావడం పెద్ద విశేషం కాదని.. తర్వాత విచారణ కూడా కొనసాగుతుందన్నారు. త్వరలోనే ఆయనకు శిక్ష పడుతుందన్నారు. జయలలిత, లాలూ యాదవ్, మధుకోడా వంటి సీఎంల జాబితాలో కేజ్రీవాల్ చేరారని.. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చినా మళ్లీ శిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లే అవకాశం ఉందని సీఎం గుర్తుంచుకోవాలన్నారు. షరతులతో బెయిల్ వచ్చి ఉండవచ్చన్న సచ్‌దేవా.. ప్రస్తుతం ఆయనకు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు.
ముఖ్యమంత్రి చేయాల్సిన పని చేయలేనప్పుడు సీఎంగా ఎందుకని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత గౌరవ్ భాటియా మాట్లాడుతూ అవినీతిపరుడైన కేజ్రీవాల్‌కు షరతులతో బెయిల్ లభించిందని.. ఆయన ఇంతకుముందు జైలుకెళ్లిన సీఎం అని.. కానీ ఇప్పుడు బెయిల్ పొందిన సీఎం అయ్యాడన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆయనపై ఆరోపణలు చేయడం తప్పేం కాదని.. ఆయన ప్రస్తుతం నిందితుల కేటగిరిలో ఉన్నారని విమర్శించారు. ఆయన పాస్‌పోర్టు కోర్టు వద్దనే ఉంటుందని.. విదేశీ పర్యటనకు వెళ్లలేరన్నారు. ప్రతి సోమ, గురువారాల్లో విచారణ అధికారి ఎదుట హాజరుకావాల్సి ఉంటుందన్నారు.