Weather Report | దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగాపడిపోతున్నాయి. వాయువ్య దిశ నుంచి నగరం వైపు చలిగాలులు వీస్తున్నాయి. ఫలితంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. నూతన సంవత్సరం తొలిరోజైన సోమవారం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలుగా నమోదైంది. గత నాలుగేళ్లలో ఇంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు 2020లో జనవరి 1న అత్యల్పంగా గరిష్ఠ ఉష్ణోగ్రత 14.7 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువ. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.1 డిగ్రీలు కాగా.. సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువ.
ఢిల్లీలోని జాఫర్పూర్లో సోమవారం అత్యంత చలిగా ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 12.4 డిగ్రీలకు పడిపోయింది. సోమవారం వాయువ్య దిశ నుంచి చలిగాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లోనూ చలి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరించింది. మంగళవారం పగటిపూట సమయంలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని, తెల్లవారు జామున పొగమంచు పేరుకుపోయే అవకాశం ఉందని తెలిపింది. వారం రోజుల పాటు ఉదయం సమయంలో పొగమంచు కమ్మే అవకాశం ఉందని తెలిపింది. జనవరి 5 వరకు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగుతాయని పేర్కొంది.
ఈ ఏడాది జనవరి 1న దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీలకు పడిపోయింది. 2013లో 19.7 డిగ్రీలు, 2022లో 19.4 డిగ్రీలు, 2021లో 17.4 డిగ్రీలు, 2020లో 17.4 డిగ్రీలు అత్యల్ప గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఢిల్లీలో సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 10.1 డిగ్రీలుగా నమోదైంది. 2012 జనవరి 1న ఢిల్లీలో 11 డిగ్రీలుగా నమోదైంది. గత 13 ఏళ్లలో ఢిల్లీలో జనవరి 1న కనిష్ఠ ఉష్ణోగ్రత 1.1 డిగ్రీలుగా నమోదైంది. 2020 సంవత్సరంలో ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.1 డిగ్రీలుగా నమోదైంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. తాజాగా ఈ ఏడాది 10 డిగ్రీలకు చేరింది. మేఘాలు ఉండడంతో రాత్రి సమయంలో వాతావరణంలోకి వేడిగాలులు వ్యాపించే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ అంచనా కేంద్రం కుల్దీప్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం లేదని వాతావరణశాఖ తెలిపింది.