Delhi Fire Accident : ఢిల్లీలోని వివేక్ విహార్ ఏరియా, షహదారాలోని నాలుగంతస్తుల బిల్డింగులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. వేకువ ఝామున 3.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు దాదాపు 15 మందిని రక్షించాయి. అయితే, సహాయక చర్యలకు చాలా ఆటంకం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాల్ని అధికారులు ఆరా తీస్తున్నారు.
మొదట రెండో ఫ్లోర్లో మొదలైన మంటలు తర్వాత మూడు, నాలుగు ఫ్లోర్లలోకి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు, అంబులెన్స్‌లు 22 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నాయి. ఎయిర్ కండీషన్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత బాధితులు తప్పించుకోవడానికి అవకాశాలు తగ్గిపోయాయి. నాలుగంతస్తుల బిల్డింగ్ అయినప్పటికీ, ఒకటే మెట్ల మార్గం ఉంది. ఒకటే లిఫ్ట్ ఉంది. దీంతో ఈ మార్గాలు మూసుకుపోవడం వల్ల బాధితులు చిక్కుకుపోయారు. ఇక రెండో ఫ్లోర్లో అగ్నిప్రమాదం కారణంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో స్మార్ట్ లాక్ ఉన్న డోర్లు మూసుకుపోయాయి.
ఫైర్ యాక్సిడెంట్ కారణంగా అవి తెరుచుకోలేదు. దీంతో ఆ ఫ్లోర్‌లోని బాధితులు ఆ రూముల్లోనే చిక్కుకుపోయారు. తర్వాత అందులోని వారి మృతదేహాల్ని సహాయక బృందాలు బయటకు తీశాయి. మంటలు చెలరేగడంతో అక్కడి వారు మేడ పైకి వెళ్లేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పైన డోర్లు మూసుకుపోయాయి. బాల్కనీ కూడా మూసి ఉంది. దీంతో బాధితులకు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. బాధితులు ముందుగా పొగ ప్రభావానికి గురై కిందపడిపోగా, తర్వాత మంటలకు దగ్ధమయ్యారు.
ఫస్ట్ ఫ్లోర్లో డోర్లు మూసుకుపోవడం వల్ల మరొకరు మరణించినట్లు తెలుస్తోంది. ఇలాంటి అనేక భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లే ఈ బిల్డింగులో మృతుల సంఖ్య పెరిగినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.