జైపూర్: చోరీ చేసిన ఎస్‌యూవీని దొంగలు రాజస్థాన్‌లో వదిలేశారు. (SUV Stolen) క్షమించాలని కోరడంతోపాటు ‘ఐ లవ్ ఇండియా’ అని రాసిన పేపర్లను ఆ వాహనం వెనుక అద్దాలకు అంటించారు. నేమ్ ప్లేట్ తొలగించిన ఆ వాహనం నంబర్‌ను కూడా ఒక పేపర్‌పై రాశారు. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నపసర్ టౌన్లో రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్ద ఎస్యూవీ పార్క్ చేసి ఉంది. గమనించిన స్థానిక వ్యక్తి దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
కాగా, పోలీసులు ఆ వాహనం వద్దకు చేరుకున్నారు. కారు ముందు, వెనుక అద్దాలకు మూడు పేపర్లు అంటించి ఉండటాన్ని గమనించారు. ‘ఈ కారును ఢిల్లీలోని పాలెం నుంచి దొంగిలించాం. క్షమించండి’ అని ఒక పేపర్‌పై రాసి ఉంది. నంబర్ ప్లేట్ లేని ఆ కారు నంబర్‌ను ‘డీఎస్ 9 సీఏ జెడ్ 2937’గా అందులో పేర్కొన్నారు. ‘ఐ లవ్ ఇండియా’ అని రెండో పేపర్‌పై రాసి ఉంది. అలాగే ఈ వాహనం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని మూడో పేపర్లో కోరారు.
మరోవైపు ఆ నంబర్ ఆధారంగా ఆ కారు ఢిల్లీకి చెందిన వ్యక్తిదని బికనీర్ పోలీసులు గుర్తించారు. వాహనం చోరీ గురించి యజమాని అక్టోబర్ 10న ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుసుకుని సమాచారం ఇచ్చారు. దీంతో ఆ వాహనం యజమానితో కలిసి ఢిల్లీ పోలీసులు బికనీర్ చేరుకున్నారు. ఆ ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నారు. ఆ కారును ఎవరు చోరీ చేశారు? ఏదైనా నేరం కోసం దానిని వినియోగించారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.