New Delhi : ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ, పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బిహార్ మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రవాద కార్యకలాపాలకు సిద్ధమవుతుండగా, అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వీరు బొమ్మ కారుతో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్ని మొసాయిబ్ అహ్మద్, మొహమ్మద్ అహ్మద్, మొహమ్మద్ సోహైల్, షేక్ ఇమ్రాన్‌లుగా గుర్తించారు. వీరంత పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు. నిందితుల్లో మొసాయిబ్ గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేశాడు.
ఈ సమయంలో రిమోట్ కంట్రోల్ కార్ తయారు చేసే స్కిల్స్ సంపాదించాడు. ఇలా తయారు చేసిన రిమోట్ కంట్రోల్ కార్ ద్వారా ఐఈడీ వంటి పదార్థాల్ని ఉపయోగించి పేలుళ్లకు పాల్పడాలని కుట్రపన్నారు. రద్దీ ప్రదేశాల్లో దాడి చేయాలని భావించి, రెక్కీ కూడా నిర్వహించారు. ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నుంచి ఇద్దరు, బిహార్, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తీవ్రవాద భావజాలానికి ఆకర్షితులయ్యారు. అలాగే, లష్కర్ ఫ్రమ్ ఖురాసన్ అనే సిద్ధాంతం ఆధారంగా ఇతరుల్ని కూడా ఇలా తీవ్రవాద భావజాలంవైపు మళ్లించేందుకు ప్రయత్నించారు. జిహాద్‌కు అనుకూలంగా ఎన్క్రిప్టెడ్ సోషల్ మీడియా గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. తమలాంటివారిని గుర్తించి, బృందంలో చేర్చుకునేందుకు ఈ సోషల్ మీడియా అకౌంట్లను వాడేవారు.
కొన్ని ఆయుధాల గురించి చర్చించేవారు. గత ఏడాది డిసెంబర్లో ఢిల్లీ వెళ్లిన నిందితులు ఎర్రకోట, ఇండియా గేట్ వంటి కొన్ని ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. అలాగే, అయోధ్యలోని రామ మందిరాన్ని, పార్లమెంట్ హౌజ్ వంటి కీలక ప్రదేశాల్ని కూడా లక్ష్యంగా ఎంచుకున్నారు. ప్రజలు, రద్దీ ఎక్కువగా ఉండే ఇలాంటి ప్రదేశాల్లో పేలుళ్ల ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలనేది వారి లక్ష్యం. అయితే, వీరి కుట్రను పోలీసులు భగ్నం చేశారు. నిందితుల దగ్గరి నుంచి ఐఈడీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.