Chhattisgarh : చత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన జరిగింది. తమ బంధువుకు బెయిల్ రావాలని కోరుకుంటూ నిందితుడి తరఫు వాళ్లు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫొటోతో క్షుద్రపూజ నిర్వహించారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్, బిలాస్పూర్ జిల్లా, సిపాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్రి గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి. కొద్దిరోజుల క్రితం స్థానికంగా ఉండే ప్రియాన్షు బోలెతోపాటు మరికొందరు కలిసి ఒక వ్యక్తిపై దాడి చేశారు. కత్తితో పొడిచారు. ఈ కేసులో ప్రియాన్షు బోలె, ఇతర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
వీరిలో కొందరికి బెయిల్ లభించింది. బోలెతోపాటు మిగతా నిందితుల బెయిల్ పిటిషన్ చత్తీస్‌గఢ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో నిందితులకు బెయిల్ వచ్చేందుకు బోలె బంధువులు క్షుద్రపూజలు నిర్వహించారు. శుక్రవారం, శనివారం రాత్రి బోలె బంధువైన రిషికేష్ కుమార్‌తోపాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిసి క్షుద్రపూజలు చేశారు. అయితే, ఈ విషయాన్ని గ్రామస్తులు గమనించారు. నిందితులు రాత్రిపూట, ఊరి అవతల ఏదో చేస్తున్నారని గ్రామస్తులు పసిగట్టారు. తర్వాత వారిని అనుసరించారు. అర్ధరాత్రి వారు పూజలు చేస్తుండగా, గ్రామస్తులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వీరిలో రిషికేష్ ఒక్కడే దొరికిపోగా.. మిగతా ముగ్గురు నిందితులు పారిపోయారు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు. క్షుద్రపూజలు నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు షాకయ్యారు. ఎందుకంటే అక్కడ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా ఫొటో ఉంది.
అలాగే, ప్రధాన నిందితుడు ప్రియాన్షు బోలె, ఈ దాడిలో గాయపడ్డ వ్యక్తి ఫొటో కూడా లభించాయి. వెంటనే ఈ ఫొటోలతోపాటు ఇతర క్షుద్రపూజ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా.. తమ బంధువు బెయిల్ కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫొటోతో క్షుద్రపూజ నిర్వహిస్తున్నామని చెప్పాడు. ఈ కేసుకు సంబంధించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఇలా క్షుద్రపూజలు చేసినంతమాత్రాన బెయిల్ రాదని ఎస్పీ రాజేష్ సింగ్ అన్నారు.