న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా సింగపూర్ వెళ్లాల్సిన విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. దాదాపు రెండు గంటలపాటు వేచిచూసినా ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్యాసింజర్స్‌ను దించేశారు.
200 మందికిపైగా ప్రయాణికులతో ఎయిర్ ఇండియా చెందిన బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ బుధవారం రాత్రి 11గంటల సమయంలో సింగపూర్‌కు బయల్దేరాల్సి ఉంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తిందని అనౌన్స్మెంట్ చేశారు. రెండు గంటలు గడిచినా మరమ్మత్తులు పూర్తి కాలేదు. కారణం ఏంటనే తెలుపకుండానే ప్రయాణికులను విమానంలో నుంచి కిందకు దించేసి ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్‌కు తరలించారు. అయితే ఈ ఘటనపై టాటాల ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే.. ఏసీ పనిచేయక పోవడం వల్లే సమస్య తలెత్తినట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో ప్రయాణికులు మ్యాగజైన్లు, న్యూస్పేపర్లతో విసురుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
కాగా, ఎయిరిండియా విమానాల్లో ఈ తరహా ఘటనలు గత కొన్ని నెలలు తరచూ చోటు చేసుకున్నాయి. మూడు నెలల క్రితం జైపూర్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానంలో కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. ఐదు గంటలపాటు తాము ఉక్కబోతలోనే ఉన్నామని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మే 19న ఢిల్లీ-పాట్నా విమానంలో కూడా ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు పేపర్లు, మ్యాగజైన్లు ఉపయోగించి గాలి తీసుకునే ప్రయత్నం చేశారు. అదే నెలలో ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. ఇక జూన్ 12న అహ్మదాబాద్-లండన్ విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే.. విమానం కూలిపోవడానికి ముందు ప్రయాణికులు ఏసీ పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు.
@airindia Passengers onboard Delhi-Singapore flight AI2380 have been suffering without AC for around 1.5 hrs also the electricity in the cabin has gone. People are forced to use papers as fans. We are getting roasted here..pls help. Pathetic. @airindia @DGCAIndia @moneycontrolcom pic.twitter.com/XlM7ABi2WG
— Ashish Mishra (@AshishM1885) September 10, 2025