Pooja Khedkar | ఉద్వాసనకు గురైన మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేసును జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనంలో విచారణ జరుగుతున్నది. పూజా ఖేద్కర్ తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు అభ్యర్థిత్వం రద్దుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీలను అందించలేదని కోర్టుకు తెలిపారు. ఆమె వద్ద కేవలం పత్రికా ప్రకటన మాత్రమే ఉందని తెలిపారు. అయితే, పూజా ఖేద్కర్ అడ్రస్ తెలియనందున ప్రకటన విడుదల చేసినట్లు యూపీఎస్సీ తరఫున హాజరైన నరేశ్ కౌశిక్ ధర్మాసనానికి తెలిపారు. పూజా అభ్యర్థిత్వం రద్దుకు సంబంధించి అధికారిక నోటీసును జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దుకు సంబంధించి రెండురోజుల్లో ఉత్తర్వులు అందజేస్తామని యూపీఎస్సీ కోర్టుకు తెలిపింది.
ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేసేందుకు తగిన వేదికను ఆశ్రయించే స్వేచ్ఛను కోర్టు ఖేద్కర్‌కు ఇచ్చింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. భవిష్యత్‌లో ఎలాంటి పరీక్షలకు హాజరకాకుండా నిషేధించింది. దీంతో పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో పూజా ఖేద్కర్‌కు యూపీఎస్సీ షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022కి పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదని నోటీసులో పేర్కొంది. పూజా ఖేద్కర్ తన పేరు, తల్లిదండ్రుల పేరు, ఫొటో, సంతకం, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, చిరునామా మార్చుకొని నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసిందంటూ యూపీఎస్సీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఖేద్కర్‌పై కేసు నమోదు చేశారు.