న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నియంతృత్వానికి సంబంధించిన అన్ని హద్దులను చెరిపేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఆతిశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జై భీమ్’ నినాదాలు చేసినందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలను మంగళవారం నుంచి మూడు రోజులపాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని ఆమె ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు.
గురువారం తమను కనీసం శాసనసభ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి సైతం అనుమతించలేదని ఆరోపించారు. ఢిల్లీ శాసన సభ చరిత్రలో ఇటువంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం శాసన సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ మినహా మిగిలిన 21 మంది ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ విజేందర్ గుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి మూడు రోజులపాటు సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు.