Delhi Police | న్యూఢిల్లీ: భారతీయ పౌరులను అక్రమంగా విదేశాలకు తరలించి వారి చేత సైబర్ నేరాలకు పాల్పడే నకిలీ కాల్ సెంటర్లలో బలవంతంగా పనిచేయిస్తున్న ఒక ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని దాదాపు 2,500 కిలోమీటర్లు వెంటాడి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన కమ్రాన్ హైదర్ అలియాస్ జైదీని నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ డీసీపీ మనోజ్ ఆదివారం తెలిపారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షల బహుమానం ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గతంలోనే ప్రకటించిందని, అదే అతడిని పట్టించిందని ఆయన చెప్పారు. ప్రకాశ్ లఖావత్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 27న న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
ఉద్యోగం కోసం వెదుకుతున్న తనకు న్యూఢిల్లీలో ఉన్న అలీ ఇంటర్నేషనల్ సర్వీసు అనే కన్సల్టెన్సీ సంస్థ గురించి తెలిసిందని లఖావత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. థాయ్‌లాండ్, లావోస్‌లో తనకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తనను థాయ్‌లాండ్ పంపించారని ఆయన చెప్పారు. అక్కడకు చేరుకున్న తర్వాత తన పాస్‌పోర్టును లాక్కుని, ఆన్లైన్లో భారతీయులను స్కామ్ చేసే ఒక చైనీస్ కంపెనీలో పనిచేయాలంటూ ఒత్త్తిడి తెచ్చారని తెలిపారు. ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేయడంతో దర్యాప్తు చేపట్టిన కేంద్ర సంస్థ ఈ కేసులో ప్రధాన కుట్రదారులుగా మంజూర్ ఆలం, సాహిల్, ఆశిష్, పవన్ యాదవ్, హైదర్‌లను గుర్తించింది.
యూరోపియన్, అమెరికన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ స్కామ్‌లకు పాల్పడేందుకు నిరుద్యోగ భారతీయ యువజనులను లావోస్‌లోని గోల్డెన్ ట్రయాంగిల్ రీజియన్‌కు ఈ ముఠా సభ్యులు తరలిస్తున్నారని డీసీపీ తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కమ్రాన్ హైదర్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వేట సాగించారని, థాయ్‌లాండ్, లావోస్ దేశాలకు పారిపోవడానికి కూడా అతను ప్రయత్నించాడని ఆయన చెప్పారు.
రాష్ర్టాలు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్న హైదర్‌ను పట్టుకునేందుకు పోలీసు బృందాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గాలింపు జరిపాయని డీసీపీ చెప్పారు. చివరకు హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో స్పెషల్ సెల్‌కు చెందిన రెండు బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయని ఆయన తెలిపారు. అవిశ్రాంతంగా 2,500 కిలోమీటర్లు వేటాడిన పోలీసు బృందాలు ఎట్టకేలకు డిసెంబర్ 7న హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో హైదర్‌ను అరెస్టు చేశాయని ఆయన చెప్పారు.