న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం నాడు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరి నుంచి మూడు పిస్తోల్స్, 22 లైవ్ కార్టిడ్జెస్ స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను ఉత్తరాఖండ్‌కు చెందిన జగ్జిత్ సింగ్(29), ఢిల్లీకి చెందిన నౌషద్(56)గా పోలీసులు గుర్తించారు. జగ్జిత్‌కు ఖలిస్తానీ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఖలిస్తానీ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నవారు ఢిల్లీలోని జహంగీర్‌పూరి ఏరియాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నౌషద్ హర్ఖత్ ఉల్ అన్సర్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నౌషద్‌పై ఇప్పటికే హత్య కేసులు నమోదు అయ్యాయి. పట్టుబడ్డ వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.