Delhi Ordinance Bill | దేశ రాజధాని ఢిల్లీపై నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వివాదాస్పద బిల్లు ‘ఢిల్లీ కేంద్ర రాజధాని ప్రాంత ప్రభుత్వం (సవరణ) బిల్లు-2023’కు లోక్సభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ విషయమై జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానే కేంద్ర ప్రభుత్వం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రూపు-ఏ ఆఫీసర్ల బదిలీలు, నియామకాల అధికారంపై కేంద్ర ప్రభుత్వం గత మే 19న ఆర్డినెన్స్ జారీ చేసింది. శాంతిభద్రతలు, పోలీసుల, భూ వ్యవహరాలు మినహా అన్ని అంశాల్లో తుది అధికారం ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్.. దాని స్థానే బిల్లు తీసుకొచ్చింది.
లోక్సభలో జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిస్తూ.. ‘ఢిల్లీ పరిధిలో అధికారులపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదే. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. 1993 నుంచి 2015 వరకూ ఏ ముఖ్యమంత్రి పోరుబాట పట్టలేదు. ప్రజలకు సేవ చేయడానికే ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయని, అందువల్లే ఎటువంటి పోరాటాలు జరుగలేదు. ప్రజలకు సేవ చేయాలంటే పోరాడాల్సిన అవసరం లేదు. కానీ, వారికి అధికారం కావాలంటే మాత్రం వారు పోరాడొచ్చు’ అని వ్యాఖ్యానించారు.