Artificial Rain | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ – ఎన్సీఆర్లో గాలి నాణ్యత సూచి 500 మార్క్‌కు చేరింది. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కృత్రిమ వర్షం కురిపించడం ఒక్కటే ఏకైక పరిష్కారమని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి (Delhi Environment Minister) గోపాల్ రాయ్ (Gopal Rai) పేర్కొన్నారు.
రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోది జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. ‘ఉత్తర భారతాన్ని పొగ పొరలు కమ్మేశాయి. స్మోగ్ నుంచి విముక్తికి కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం. ఇది మెడికల్ ఎమర్జెన్సీ. ఈ విషయమై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రికి అనేక సార్లు లేఖలు రాశాను. అయినా వారు పట్టించుకోలేదు. కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోదీ జోక్యం చేసుకోవాలి. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి’ అని గోపాల్ రాయ్ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో కృత్రిమ వర్షంపై తాను ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో లేఖలు రాసినట్లు చెప్పారు. ఇవాళ కూడా నాలుగోసారి లేఖను పంపినప్పటికీ పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ విషయంపై ఒక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఈ సమస్యకు స్పష్టమైన పరిష్కారం చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) 494గా నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. పలు ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ లెవల్స్ 500 మార్క్‌ను తాకాయి. ద్వారకలో అత్యల్పంగా 480గా నమోదైంది. సోమవారం కూడా ఢిల్లీలో కాలుష్యం ఇదే స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ వరుసగా రెండో రోజు కూడా దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజధానిలో విషపూరిత పొగమంచు కారణంగా దృశ్యమానత పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాజధానికి రాకపోకలు సాగించే కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇవాళ ఉదయం దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరో తొమ్మిది రైళ్లను అధికారులు రద్దు చేశారు.
కృత్రిమ వర్షం అంటే..?
కృత్రిమ వర్షాన్ని (Artificial Rain) క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఈ విధానంతో వెదర్లో మార్పును తీసుకువస్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. సిల్వర్ ఐయోడైడ్, పొటాషియం ఐయోడైడ్ లాంటి పదార్థాలను గాలిలోకి వదులుతారు. దీని కోసం విమానాన్ని కానీ హెలికాప్టర్‌ను కానీ వాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే, ఆ పరీక్ష సమయంలో వాతావరణంలో తేమ చాలా అవసరం అవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ వర్షం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంది. నీటితో ఆ డస్ట్ కొట్టుకుపోయి.. పర్యావరణం క్లీన్ అవుతుంది.
Also Read..
Massive Pile Up | పొగమంచు కారణంగా ఢీకొన్న వాహనాలు.. ఇద్దరు మృతి.. అనేక మందికి గాయాలు
Air Pollution | 500 మార్క్‌ను తాకిన గాలి నాణ్యత సూచి.. ఈ సీజన్లో ఇదే అత్యధికం