Delhi Liquor Scam | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చిక్కులు తప్పేలాల లేవు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రితో సహా పలువురు నాయకులు అరెస్టయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీని సైతం నిందితుల జాబితాలో ఈడీ చేర్చబోతున్నది. ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకించింది.
ఈ సందర్భంగా ఈడీ తరఫున న్యాయవాది మాట్లాడుతూ తదుపరి ఛార్జ్షీట్లో ఆప్ పార్టీని సైతం సహ నిందితుడిగా చేర్చబోతున్నట్లు తెలిపారు. ఈ కేసులో అభియోగాలను నమోదు చేసే ప్రక్రియను జాప్యం చేసేందుకు నిందితులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ వాదనలు వినిపించారు. కేసు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం లేదని.. కేసుల విచారణ ఇంకా కొనసాగుతుందని.. అరెస్టులు కొనసాగుతున్నా ఏమాత్రం పురోగతి లేదన్నారు. విచారణ కూడా తుది దశకు చేరలేదన్నారు.
సిసోడియా విచారణను ఆలస్యం చేస్తున్నారన్న వాదనలను ఆయన తప్పుపట్టారు. విచారణను ఈడీ ఆలస్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై నిర్ణయాన్ని ప్రస్తుతానికి రిజర్వ్ చేశారు. నిందితుల జాబితాలో ఆప్ పార్టీని చేర్చితే.. చరిత్రలో తొలిసారిగా ఓ జాతీయ పార్టీ పేరును నిందితులుగా ప్రస్తావించినట్లవుతుంది. మద్యం కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు అయినప్పుడు.. నిందితుల జాబితాలో ఆ పార్టీని ఎందుకు చేర్చలేదని గతేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే, మద్యం పాలసీ కేసులో రూ.100కోట్లు ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని ఈడీ ఆరోపించింది.