న్యూఢిల్లీ, మే 21: నకిలీ పత్రాల ద్వారా కారుణ్య నియామకంలో ఉద్యో గం పొందిన మహిళ పట్ల ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వా రిపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదని, వీరిని సర్వీసు నుంచి తొలగించడాన్ని తప్పు బట్టలేమని స్పష్టం చేసింది. ఓ మహిళ తన భర్త చనిపోవడంతో కారుణ్య నియామకంలో భాగంగా బీహార్ భవన్లో గ్రూప్-4 ఉద్యోగం పొందింది. 2009లో తాగి గొడవ చేసిన కారణంగా ఆమెకు అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చారు.
దీనిపై విచారణ జరుపుతుండగా ఉద్యోగంలో చేరే సమయంలో ఆమె ఎనిమిదో తరగతి చదివినట్టు ఇచ్చిన పత్రం నకిలీదని బయటపడింది. దీంతో 2014లో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ మిని పుష్కర్ణ.. నకిలీ పత్రంతో ఉద్యోగం పొందిన వారి పట్ల కఠినంగానే ఉండాలని, అలాంటి వారు ఉద్యోగానికి అనర్హులని స్పష్టం చేశారు.