P Chidambaram | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాఖలు చేసిన ఎయిర్ సెల్ – మ్యాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరానికి ఢిల్లీలో హైకోర్టు ఊరటనిచ్చింది. ట్రయల్ కోర్టు విచారణపై ఢిల్లీ హైకోర్టు బుధవారం స్టే విధించింది. కాంగ్రెస్ నేత పిటిషన్‌పై ఈడీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరంపై ట్రయల్ కోర్టులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకొని నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను జనవరి 22కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రి పేర్కొన్నారు. ఈ కేసులో వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
చిదంబరం తరపున సీనియర్ న్యాయవాది ఎన్ హరిహరన్, అర్షదీప్ సింగ్ ఖురానా, అక్షత్ గుప్తా వాదనలు వినిపించారు. మాజీ కేంద్రమంత్రిపై ప్రాసిక్యూషన్‌కు ఎలాంటి అనుమతి లేకపోవడంతో ప్రత్యేక న్యాయమూర్తి మనీలాండరింగ్‌కు సంబంధించిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకున్నారని.. ఆయనపై వచ్చిన ఆరోపణలు అధికారిక విధులతో సంబంధం లేదని.. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు అనుమతి అవసరం లేదని ఈడీ న్యాయవాది అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ క్రమంలో మధ్యంతర ఉపశమనం కల్పించాలని.. ట్రయల్ కోర్టులో కొనసాగుతున్న విచారణపై స్టే విధించాలని చిదంబరం కోరారు. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరం, కార్తీలపై సీబీఐ, ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లపై ట్రయల్ కోర్టు నవంబర్ 27, 2021న విచారణ చేపట్టి, సమన్లు జారీ చేసింది.
సీఆర్పీసీ సెక్షన్ 197 (1) ప్రకారం ప్రాసిక్యూషన్ కోసం అనుమతి పొందడం తప్పనిసరని.. ఈడీ ఇప్పటి వరకు ప్రాసిక్యూషన్‌కు అనుమతి తీసుకోలేదని చిదంబరం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రస్తుతం, అభియోగాల పరిశీలన కోసం ట్రయల్ కోర్టు ఎదుట ప్రొసీడింగ్స్ ఫిక్స్ అయ్యాయని లాయర్ తెలిపారు. 2006లో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందానికి (FIPB) అనుమతి లభించింది. ఆర్థిక మంత్రిగా చిదంబరం ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు తనశక్తికి మించి ప్రయత్నించారని.. దాంతో కొందరికి లబ్ధి చేకూరిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేయగా.. మనీలాండరింగ్ నేపథ్యంలో ఈడీ సైతం రంగంలోకి దిగింది.