న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 : తమ వివాహాన్ని ముక్కలు చేసి, తమ ప్రేమను దెబ్బతీసిన తన జీవిత భాగస్వామికి చెందిన కొత్త భాగస్వామి నుంచి భర్త లేదా భార్య నష్టపరిహారాన్ని కోరవచ్చని ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్పై సెప్టెంబర్ 15న విచారణ జరిపిన జస్టిస్ పురుషేంద్ర కౌరవ్ అక్రమ సంబంధం అన్నది ఇప్పుడు నేరం కాదని, కాని దాని పర్యవసానాలు ప్రమాదకరంగా ఉంటాయని చెప్పారు. వివాహ పవిత్రతపై మనుషులకు కొన్ని అంచనాలు ఉంటాయని, అయితే వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకోవడం నేరం కాదని న్యాయమూర్తి తెలిపారు.
అక్రమ సంబంధాన్ని నేరంగా పరిగణించి శిక్షించలేమని, కాని అది జీవితానికి, హక్కులకు ప్రమాదకరంగా పరిణమించగలదని ఆయన అన్నారు. జోసెఫ్ షైన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ అక్రమ సంబంధాలను నేరరహితంగా ప్రకటించిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. అయితే వివాహేతర సంబంధాలకు సుప్రీంకోర్టు లైసెన్సు ప్రకటించలేదని కూడా న్యాయమూర్తి గుర్తు చేశారు. కాగా, వివాహ బంధాన్ని తెంపినందుకు జీవిత భాగస్వామికి చెందిన కొత్త భాగస్వామి నుంచి ఆర్థిక పరిహారం పొందే మొదటి కేసుగా ఇది నిలుస్తుంది.