Supreme Court | పాత వాహనాలపై విధించిన పూర్తి నిషేధాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పదేళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను 2018 అక్టోబర్ 29న సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ పిటిషన్పై ఈ నెల 28న విచారణ జరిగే అవకాశం ఉన్నది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనున్నది. వాహనాల వయసు ఆధారంగా మాత్రమే తొలగించడం కాలుష్యాన్ని నియంత్రించడానికి శాస్త్రీయ మార్గం కాదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంటున్నది. ఫిట్నెస్ ఆధారం వాహనం వయసు కాదని.. వాస్తవ కాలుష్య స్థాయి అని పిటిషన్లో పేర్కొంది. శాస్త్రీయ దర్యాప్తు, ప్రమాణాలు అవసరమని తెలిపింది. వయసు ఆధారిత నిషేధం మరింత ప్రభావవంతంగా ఉందా లేదా? కాలుష్య స్థాయి ఆధారిత విధానమా? అని నిర్ధారించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) వివరణాత్మక అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
వాస్తవానికి 2014 నవంబర్ 26న ఎన్జీటీ ఉత్తర్వుల్లో 15 సంవత్సరాల కంటే పెట్రోల్, డీజిల్ వాహనాలను రోడ్లపై నడపడకూడదని స్పష్టంగా పేర్కొంది. ఏదైనా పాతరకం వాహనాలు కనిపిస్తే స్వాధీనం చేసుకొని మోటారు వాహనాల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నిషేధం అన్ని ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, తేలికపాటి, భారీ వాహనాలు, ప్రైవేట్, వాణిజ్య వాహనాలకు కూడా ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. అయితే, 2018లో పాత వాహనాలపై నిషేధించిన ఉత్తర్వులను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని బీజేపీ ప్రభుత్వం పేర్కొంటున్నది. వాయు కాలుష్యానికి వాహనాలు మాత్రమే కారణం కాదని చెబుతున్నది. వ్యర్థాలు, గడ్డి, కలప కాల్చివేత సహా రోడ్లు, నిర్మాణాల నుంచి వస్తున్న దుమ్ము, కర్మాగాల నుంచి వచ్చే పొగతో పాటు ఇలా అనే కారకాలు ఉన్నాయని పేర్కొంది. అలాగే, సీజన్ ప్రకారం.. కాలుష్య స్థాయి మారుతూ ఉంటుందని పేర్కొంది.
ఢిల్లీ ప్రభుత్వ రవాణాశాఖ పీయూసీ నిబంధనలు చాలా కఠినంగా అమలు చేసిందని.. ఫలితంగా ఈ సంవత్సరం తొలి నేడు నెలల్లో 1,63,103 చలాన్లు జారీ అయ్యాయని తెలిపింది. ఈ సంఖ్య 2021లో కేవలం 29,589, 2022లో 43,494, 2023లో 36,176.. 2024లో 68,077 మాత్రమేనని చెప్పింది. ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలను పాటించడంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపింది. నగరంలో సీఎన్జీ, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచడం, రోడ్ల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వల్ల వాహన కాలుష్యం తగ్గిందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు పర్యావరణంపై మంచి ప్రభావం చూపినట్లుగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది.