న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. జశ్వంత్ సింగ్, ఆయన కొడుకు తురుణ్దీప్ సింగ్ హత్య కేసులో సజ్జన్ దోషిగా తేలారని ప్రత్యేక జడ్జి కావేరి బవేజా తెలిపారు.
ఈ కేసులో దోషికి మరణ దండన విధించాలని బాధిత పక్షం కోర్టును కోరింది. నాడు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ హత్య అనంతరం ఢిల్లీలో సిక్కులపై జరిగిన దాడిలో 2,733 మంది చనిపోయారు. ఆనాడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సజ్జన్ కుమార్ అల్లర్లకు సారథ్యం వహించి దాడుల్లో పాల్గొన్నట్టు నిరూపితం కావడంతో గత నెల 12న కోర్డు ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు.