న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. (court summons) ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో అక్టోబర్ 7న కోర్టులో హాజరుకావాలని వారిని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కోర్టుకు పిలిపించడం ఇదే తొలిసారి. ఈ కేసులో తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని కోర్టు పేర్కొంది. గతంలో ఏకే ఇన్ఫోసిస్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా ఉన్న ఆయన పేరు మొదటి ఛార్జ్‌షీట్‌లో లేదు. అయితే ఈసారి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులపై దాఖలైన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.
కాగా, లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులకు భూమి బదాయింపునకు బదులుగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా కొందరు వ్యక్తులకు పలు రైల్వే జోన్లలో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, 38 మంది అభ్యర్థులతో సహా 77 మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను జూన్‌లో సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా ఆగస్ట్ 6న తుది నివేదికను కోర్టుకు సమర్పించింది.