Sunita Kejriwal | న్యూఢిల్లీ, జూలై 6: రాజకీయ కుట్రలో తన భర్త బాధితుడని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఎన్డీఏలో భాగమైన తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసినట్టు సునీత ఆరోపించారు. కుమారుడు రాఘవరెడ్డిని కాపాడుకునేందుకే శ్రీనివాసులు రెడ్డి అబద్ధం చెప్పాడని పేర్కొన్నారు.
ట్రస్ట్ ఏర్పాటు కోసం భూమిని కేటాయించాల్సిందిగా కేజ్రీవాల్‌ను కలిసి కోరినట్టు మొదట శ్రీనివాసులు రెడ్డి చెప్పారని తెలిపారు. ఈ స్పందన ఈడీకి నచ్చలేదని, కొన్ని రోజులకు ఆయన కుమారుడు రాఘవరెడ్డిని అరెస్టు చేసిందని చెప్పారు. ఆ తర్వాత కూడా శ్రీనివాసులు రెడ్డిని ఈడీ ప్రశ్నించినప్పటికీ ఆయన తాను ముందు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమేనని చెప్పారని, దీంతో రాఘవరెడ్డికి బెయిల్ దక్కలేదని తెలిపారు.
చివరకు, జూలై 17, 2023న శ్రీనివాసులు రెడ్డి తన స్టేట్మెంట్ను మార్చుకున్నారని చెప్పారు. ‘ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయాలని కేజ్రీవాల్ అడిగారని, ఇందుకు బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వాలని అడిగారని’ శ్రీనివాసులు రెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినట్టు సునీత ఆరోపించారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన మరునాడే ఆయన కుమారుడు రాఘవరెడ్డి బెయిల్‌పై విడుదల అయ్యాడని చెప్పారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారుల నుంచి రూ.7 కోట్లు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్‌పై ఏసీబీ విచారణకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. బీఈఎల్పై ఉన్న రూ.16 కోట్ల జరిమానాను మాఫీ చేసేందుకు సత్యేందర్ లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.