వడోదర, మార్చి 15: దేశంలో ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే బీజేపీని అంతం చేసే శక్తి ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్లో శుక్రవారం ఆయన పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గుజరాత్లో తమ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు. కాగా, ఇండియా కూటమితో ఒప్పందంలో భాగంగా గుజరాత్లో ఆప్ రెండు, కాంగ్రెస్ 24 పార్లమెంట్ స్థానాలలో పోటీ పడుతున్నాయి.
కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ తనపై దాఖలు చేసిన కేసుల విచారణను నిలిపేయాలని ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఓ ప్రభుత్వ అధికారి జారీ చేసిన సమన్లకు అనుగుణంగా ఆయన వ్యవహరించలేదని ఈడీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీపై దర్యాప్తునకు సంబంధించిన కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటివరకు 8 సమన్లను జారీ చేసింది. కానీ ఆయన ఈడీ అధికారుల విచారణకు హాజరు కాలేదు. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఆయనకు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు ఇచ్చింది. ఈ సమన్లను నిలిపేయాలని ఆయన సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో ఆయన ఈ నెల 16న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.