ముంబై, మే 24: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి పాల్పడుతున్నదని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ప్రతిపక్షాలు తాము కాదని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి కేంద్రమే ప్రతిపక్షమని విమర్శించారు. ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ బుధవారం ఠాక్రేను ముంబైలోని ఆయన నివాసంలో కలిశారు. కేంద్రం ఆర్డినెన్స్ బిల్లును పార్లమెంట్‌కు తీసుకువస్తే.. వ్యతిరేకిస్తామని ఠాక్రే హామీ ఇచ్చారు. దేశాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఠాక్రే అన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొన్నారని, అయితే ఢిల్లీలో పాలనాధికారాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును బుల్డోజ్ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం ఏ విధమైన ప్రజాస్వామ్యమని మోదీ సర్కార్‌ను నిలదీశారు.
కేంద్రానిది అహంకార వైఖరి
సుప్రీంకోర్టు అంటే మోదీ సర్కార్‌కు గౌరవం లేదని కేజ్రీవాల్ విమర్శించారు. తమకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇస్తుందనే ఆహంకారం కేంద్రానికి ఉన్నదని, అందులో భాగంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఒక వ్యక్తి అహంకారపూరితంగా, స్వార్థంగా మారి తే.. దేశాన్ని నడుపలేరని ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శించారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్నదని ఆరోపించారు. మహారాష్ట్రలోనూ ఠాక్రే ప్రభుత్వాన్ని ఇలానే కూల్చిందన్నారు. రాజ్భవన్లు బీజేపీ ప్రధాన కార్యాలయాలుగా, గవర్నర్లు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా మారారని పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ వ్యాఖ్యానించారు.