Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య (Air Pollution) కోరల్లో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. గాలి నాణ్యత సూచీ అధ్వాన స్థితిలో నమోదవుతోంది. మంగళవారం ఉదయం కూడా గాలి నాణ్యత అధ్వానంగా నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) ప్రకారం.. ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీలో గాలి నాణ్యత 355గా నమోదైంది.
అశోక్ విహార్ వద్ద 367, ద్వారకా సెక్టార్ 8 వద్ద 390, డీటీయూ వద్ద 366, జహంగిరిపురిలో 417, లోధి రోడ్డులో 313, ముండ్కాలో 404, నజఫ్గఢ్లో 355, నరేలాలో 356, ఆనంద్ విహార్‌లో 403, ప్రతాప్‌గంజ్‌లో 371, పూసాలో 320, ఆర్కే పురంలో 365, రోహిణిలో 415, షాదీపూర్‌లో 359, వివేక్ విహార్‌లో ఏక్యూఐ లెవల్స్ (Air Quality Index) 385గా నమోదయ్యాయి.
రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో రాజధాని వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శ్వాస తీసుకోవడం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగా మారుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి దీర్ఘకాలిక పరిష్కారాన్ని చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
‘గత 25 ఏళ్లుగా ఢిల్లీలోనే ఉంటున్నాను. ఇటీవలే కాలంలో రాజధానిలో కాలుష్యం తీవ్రమవుతోంది. ప్రభుత్వం క్రాకర్స్‌పై మాత్రమే ప్రధానంగా దృష్టి పెడుతోంది. అయితే, దీనికి ప్రధాన కారణం సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడమే’ అని కర్తవ్య పథ్ వద్ద వరుణ్ అనే వ్యక్తి అన్నారు. మరో ఢిల్లీ నివాసి అంకిత్ సచ్‌దేవా మాట్లాడుతూ.. రాజధానిలో సౌకర్యాల కోసం ప్రభుత్వానికి పన్నులు కడుతున్నామన్నారు. అయినప్పటికీ ఈ పరిస్థితి ఉందన్నారు. నగరంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. అయితే, గత కొంతకాలంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోన్న విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడానికి తోడు.. మంచు రాజధానిని కమ్మేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ కారణంగా నగర వాసులు తీవ్ర అనారోగ్య సమసల్యకు గురికావాల్సి వస్తోంది.
Also Read..
Mike Waltz | అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్..!
Chenab Rail Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై భద్రతా దళాల మాక్ డ్రిల్
Rajasthan: మొబైల్ టవర్‌పైనే కొనసాగుతున్న నిరసన.. ఇద్దర్ని కిందకు దించేందుకు ప్రయత్నాలు