Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) రేఖా గుప్తాకు ఎట్టకేలకు అధికారిక నివాసాన్ని కేటాయించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు. అయితే, అంతకముందు కేజ్రీవాల్ నివాసం ఉన్న సివిల్ లైన్స్‌లోని సీఎం అధికారిక నివాసం వ్యవహారం వివాదాస్పదమైంది.
ఆ బంగ్లాను బీజేపీ ‘శీష్ మహల్’ (Sheeshmahal)గా అభివర్ణిస్తోంది. వివాదాస్పద శీష్ మహల్‌కు దూరంగా ఉండాలని బీజేపీ అప్పుడే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేఖా గుప్తా తన కుటుంబ సభ్యులతో కలిసి షాలిమార్ బాగ్‌లో నివాసం ఉంటున్నారు. దీంతో అక్కడికి వచ్చే సందర్శకులు, వీఐపీలు, సీనియర్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక సచివాలయానికి వెళ్లేందుకు రోజూ 25 కిలోమీటర్లు ఆమె ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టిన దాదాపు 100 రోజుల తర్వాత రేఖా గుప్తాకు సివిల్ లైన్స్‌లోని రాజ్ నివాస్ మార్గంలో అధికారిక బంగ్లాను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కేటాయించింది. ఆమె సొంత నియోజకవర్గానికి సమీపంలోనే నూతన బంగ్లాను కేటాయించింది. సీఎంకు 1/8, 2/8 నంబర్లతో కూడిన బంగ్లాలను కేటాయించారు.
ఇక 3/8 నంబర్ బంగ్లాను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రవీంద్ర ఇంద్రరాజ్కు కేటాయించగా.. డిప్యూటీ స్పీకర్ మోహన్ సింగ్ బిష్ట్‌కు 4/8 నంబర్ బంగ్లాను కేటాయించారు. పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సాకు మధుర రోడ్డులోని AB 17 నివాసాన్ని కేటాయించారు. ఈ నివాసంలో గతంలో ఆప్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివసించారు. ఇక బీజేపీ ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రులకు నగరంలోని అధికారిక నివాసాలను ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే.
అదో శీష్ మహల్..
కాగా, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పని చేసిన సమయంలో సివిల్ లైన్స్‌లో ఆయన అధికారిక నివాసం ఏర్పరుచుకున్నారు. అయితే, ఆ నివాసాన్ని బీజేపీ ‘శీష్ మహల్’గా అభివర్ణిస్తోంది. ఢిల్లీ సీఎం అధికార నివాసాన్ని దాదాపు రూ.80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు ఆరోపిస్తోంది. కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు షీష్ మహల్ (Sheesh Mahal) ఆధునీకరణంలో భాగంగా టాయిలెట్లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ ఆరోపించింది.
మ్యూజియంగా మారుస్తాం..
తమ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని ఆయుధంలా వాడుకుంది. ఈ బంగ్లాను పునరుద్ధరించడంలో పెద్ద స్కామ్ జరిగిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఈ అంశం ఢిల్లీ ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆప్ ఓటమికి ఇది కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో అధికారం చేపట్టిన బీజేపీ సర్కార్.. శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తామని సీఎం రేఖా గుప్తా ఇప్పటికే ప్రకటించారు. బంగ్లాలోకి త్వరలోనే రిపోర్టర్లను తీసుకెళ్లనున్నట్లు డిప్యూటీ సీఎం పర్వేశ్ వర్మ (Parvesh Verma) వెల్లడించారు.
Also Read..
Katra-Srinagar Vande Bharat: శ్రీనగర్ టు కాట్రా.. వందేభారత్ టికెట్ ధర రూ.660
Chenab Bridge | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
Nikhil Sosale: ఎవరీ నిఖిల్ సోసేల్?..ఆర్సీబీతో అతనికి లింకేంటి?