కాట్రా: చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జ్‌ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాట్రా నుంచి శ్రీనగర్ ప్రయాణించే వందేభారత్(Katra-Srinagar Vande Bharat) రైలును కూడా ఆయన పచ్చజెండా ఊపి స్టార్ట్ చేశారు. అయితే జూన్ ఏడో తేదీ నుంచి ఆ రైలు నడవనున్నది. శ్రీనగర్ నుంచి కాట్రా, కాట్రా నుంచి శ్రీనగర్‌కు రెండు వందేభారత్ రైళ్లు నడవనున్నాయి. వారానికి ఆరు రోజులు ఆ రైళ్లు ఉంటాయి. ఐఆర్సీటీసీలో ఆ రైళ్లకు చెందిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఐఆర్సీటీసీ ప్రకారం ఏసీ చైర్‌కార్ టికెట్ ధర 660గా ఉన్నది. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింకు రూట్లో చీనాబ్ బ్రిడ్జ్ కీలకంగా నిలవనున్నది. 272 కిలోమీటర్ల రూట్లో చీనాబ్ బ్రిడ్జ్ కీలకంగా వ్యవహరించనున్నది. సుమారు 43,780 కోట్ల ఖర్చుతో యూఎస్బీఆర్ఎల్ రైల్వే లింకును నిర్మించారు. 36 టన్నెళ్లు, 943 బ్రిడ్జ్‌లు కూడా ఉన్నాయి.
#WATCH | Katra, J&K: Prime Minister Narendra Modi flags off Vande Bharat Express, connecting Katra and Srinagar, from Katra Railway Station. #KashmirOnTrack
(Video: DD) pic.twitter.com/ghJREpDfii
— ANI (@ANI) June 6, 2025
కశ్మీర్ వ్యాలీలో ఇప్పుడు రైళ్ల కూత మోగనున్నది. కాట్రాలోని వైష్ణోదేవి పుణ్య క్షేత్రం మార్గంలో వందేభారత్ రైలు ప్రయాణించనున్నది. రెండు జతల వందేభారత్ రైళ్లు ఆ రూట్లో తిరగనున్నాయి. ట్రెయిన్ నెంబర్ 26404/26403, మరియు 26401/26402 .. శ్రీనగర్-కాట్రా-శ్రీనగర్ రూట్లో ప్రయాణిస్తాయి. ఒకే ఒక్క స్టాప్ ఇచ్చారు. బనిహల్‌లో ఆ రైలు ఆగుతుంది. టూరిస్టులు, స్థానికుల కోసం ఈ రైలు సేవలు అందించనున్నట్లు చెబుతున్నారు.
వందేభారత్ రైలును సెప్టెంబర్ నుంచి జమ్మూకు పొడిగించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. జమ్మూ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం 5, 6 నెంబర్ల ప్లాట్‌ఫాం నిర్మాణం జరుగుతున్నదని, అవి పూర్తి కాగానే వందేభారత్‌ను పొడిగిస్తామన్నారు. భవిష్యత్తులో ఢిల్లీ, శ్రీనగర్ మధ్య వందేభారత్ స్లీపర్ రైలును నడిపే యోచనలో ఉన్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. రైలు నిర్మాణం పూర్తి అయిన తర్వాత .. దాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాజధాని, శతాబ్ధి రైళ్ల కన్నా ఇది వేగంగా ప్రయాణిస్తుంది.