రాంచీ, ఏప్రిల్ 21: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. తీహార్ జైలులో ఉన్న తన భర్తను హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాంచీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ, నేరం రుజువు కాకపోయినా కేజ్రీవాల్‌ను, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్‌లను అరెస్ట్ చేయడం నియంతృత్వమని అన్నారు. ‘అసలు నా భర్త చేసిన తప్పేంటి? మంచి విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడమా?’ అని ఆమె ప్రశ్నించారు. ‘ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సలో భాగంగా గత 12 ఏండ్లుగా ప్రతిరోజు 50 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటున్నారు. అయితే జైలులో ఆయనకు ఇన్సులిన్ మాత్రం ఇవ్వడం లేదు. వారు కేజ్రీవాల్‌ను చంపాలనుకుంటున్నారు’ అని ఆమె పేర్కొన్నారు.
ప్రతిపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ప్రజాస్వామ్యాన్ని విఫలం కానివ్వరాదని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం జైలులో ఉన్న హేమంత్ సోరెన్ పంపిన సందేశాన్ని ఆయన సతీమణి కల్పన సొరేన్ బహిరంగ సభలో చదివి వినిపించారు. ఈ సభలో ఇండియా కూటమిలోని 28 పార్టీల నేతలు పాల్గొన్నారు. కల్పన మాట్లాడుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కడం కోసం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.