న్యూఢిల్లీ, మే 18: వివాదాలు, కేసులతో ఆప్‌ను అణగదొక్కలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ప్రజల గుండెల్లో ఆప్ స్థానం సంపాదించుకున్నదని, ఒక్క నాయకుడిని జైల్లో పెడితే..వందలాది మంది నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు. ఆదివారం బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు ‘జైల్ భరో’ ఆందోళన చేపడతామని కేజ్రీవాల్ ప్రకటించారు. తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్ అరెస్టుపై కేజ్రీవాల్ స్పందిస్తూ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
ఆప్ నేతలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ అరెస్టు చేస్తున్నదని, ఇలాంటి చర్యలతో ఆప్‌ను అణగదొక్కలేరని అన్నారు. ‘ప్రధాని మోదీకి ఒక్కటి చెప్పదలుచుకున్నా. ఒక్కొక్కరిని అరెస్టు చేయటం అనే ఆటను మీరు ప్రారంభించారు. ఆదివారం బీజేపీ కార్యాలయానికి వస్తాం. ఆప్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు..మీకు కావాలనుకునే వారిని జైల్లో పెట్టండి. మమ్మల్ని జైల్లో పెడితే..ఆప్‌ను అణచివేయొచ్చని అనుకుంటున్నారు.
అలా జరగదు. కావాలంటే ప్రయత్నించండి’ అని కేజ్రీవాల్ చెప్పారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశాం, మొహల్లా క్లినిక్‌లను తీసుకొచ్చాం, ఉచిత, నిరంతరాయ కరెంట్‌ను సరఫరా చేస్తున్నాం. ఇదే ఆప్ చేసిన నేరం. ఎందుకంటే ఇవేవీ బీజేపీ చేయలేదు కాబట్టి’ అంటూ బీజేపీ తీరును ఎండగట్టారు.