IndiGo flight : ఇండిగో విమానానికి శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. జూన్ 12న లక్నో నుంచి ఢిల్లీ బయల్దేరాల్సిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. విమానం టేకాఫ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న భద్రతాదళాలు వేగంగా స్పందించాయి.
విమానాన్ని నిలిపివేశారు. విమానంలోని ప్రయాణికుల్ని, సిబ్బందిని దింపివేశారు. దూరంగా నిలిపి తనిఖీలు చేపడుతున్నారు. సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)తోపాటు స్థానిక పోలీసులు ఈ సెక్యూరిటీ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్నారు. సెక్యూరిటీ ప్రొటోకాల్ ప్రకారం అధికారులు విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేసి, వారి కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. బాంబు బెదిరింపు కాల్ తర్వాత కొద్దిసేపు విమాన సేవలకు ఎయిర్‌పోర్టులో అంతరాయం కలిగింది. కొన్ని విమాన సర్వీసులకు ఆలస్యం కానున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఎయిర్‌పోర్టులో కూడా తనిఖీలు చేపడుతూ, భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఈ బాంబు బెదిరింపు ఎవరు చేశారు.. ఎక్కడ్నుంచి వచ్చింది అనే అంశాలపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రయాణికుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రోటోకాల్ ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.