లక్నో: ఇండిగో విమానంలో ఎలుక కనిపించింది. దీంతో ప్రయాణికులను దించి వేశారు. ఆ విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి ఎలుకను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మూడు గంటలు ఆలస్యంగా ఆ విమానం బయలుదేరింది. (Rat In IndiGo flight) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం సోమవారం మధ్యాహ్నం 2.10 గంటలకు ఢిల్లీ నుంచి కాన్పూర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నది. మధ్యాహ్నం 2.50 గంటలకు తిరిగి ఢిల్లీకి ఆ విమానం బయలుదేరాల్సి ఉన్నది.
కాగా, ఇండిగో విమానంలోకి ప్రయాణికులు ఎక్కారు. అయితే అందులో ఎలుక ఉండటాన్ని ఒక ప్రయాణికుడు గమనించాడు. విమాన సిబ్బందిని అలెర్ట్ చేశాడు. దీంతో ప్రయాణికులందరినీ విమానం నుంచి ఖాళీ చేయించారు. విమానాశ్రయం లాంజ్‌లో వేచి ఉండమని వారిని కోరారు.
మరోవైపు ఎలుక కోసం ఆ విమానంలో తనిఖీ చేశారు. గంటన్నర పాటు వెతికిన తర్వాత దానిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ విమానం మూడు గంటలు ఆలస్యంగా ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది. కాన్పూర్ విమానాశ్రయం డైరెక్టర్ సంజయ్ కుమార్ దీనిని ధృవీకరించారు. ఇండిగో విమానంలో ఎలుకను గుర్తించిన నేపథ్యంలో పూర్తి తనిఖీ తర్వాతే బయలుదేరేందుకు అనుమతించినట్లు వెల్లడించారు.
Also Read:
Air India Plane | ఎక్కని ప్రయాణికుడు.. వెనక్కి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం
Ship Catches Fire | సొమాలియా వెళ్లే నౌకలో మంటలు.. లోడ్ చేసిన బియ్యం బస్తాలు ఆహుతి