న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియా విమానం ఏఐ-244 కొద్దిసేపటి క్రితం 129 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది. ఈ సాయంత్రం 6.06 గంటలకు విమానం కాబూల్ విమానాశ్రయంలో టేకాఫ్ అయ్యిందని ఎయిరిండియా అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులను చాలా దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పరిస్థితులను బట్టి ఆఫ్ఘనిస్థాన్‌లోని భారత దౌత్యాధికారులను వెనక్కు రప్పించాలా..? లేక అక్కడే ఉంచాలా..? అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో గత కొన్ని వారాలుగా తాలిబన్లకు, ప్రభుత్వ బలగాలకు మధ్య అంతర్యుద్ధం కొనసాగింది. అప్పటికే ఆఫ్ఘనిస్థాన్ నుంచి విదేశీ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు మెల్లమెల్లగా పట్టుబిగించారు. ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తూ వచ్చి చివరగా ఇవాళ రాజధాని కాబూల్‌ను కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు. దాంతో ఆ దేశం మొత్తం తాలిబన్ల వశం అయిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాబూల్ నుంచి ఎయిరిండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది.