Kejriwal Govt | ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతికి వినపతిపత్రం సమర్పించారు. రాష్ట్రపతి సెక్రటేరియట్ డైరెక్టర్ శివేంద్ర చతుర్వేది ప్రతిపక్ష నేత విజేంద్ర గుప్తాకు లేఖ పంపారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆగస్టు 30న రాష్ట్రపతిని కలిసి మెమోరాండం ఇచ్చినట్లుగా అందులో ప్రస్తావించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రిత్వ శాఖకు లేఖను పంపినట్లు పేర్కొన్నారు. మరోవైపు రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ఇప్పటికే అంగీకరించిందని ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అతిషి విమర్శించారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని బ్యాక్ డోర్ ద్వారా బర్తరఫ్ చేయాలని బీజేపీ భావిస్తోందని.. ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడమే బీజేపీ అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బీజేపీ భయపడుతోందని.. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు సేవ చేశారన్నారు. ఇది బీజేపీ కొత్త కుట్ర అని.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి సున్నా సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు.