న్యూఢిల్లీ: బీజేపీ నేత రమేష్ పెహల్వాన్ తన భార్య కుసుమలతతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో ఆదివారం చేరారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుని సభ్యత్వం తీసుకున్నారు. (BJP Leader Joins APP) ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు ఆప్‌లో చేరారు. 2025 ఫిబ్రవరిలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు పోటీలో ఉన్నారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం నాలుగో జాబితాను ఆప్ ఆదివారం విడుదల చేసింది. తుది జాబితాలో 38 మంది అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. ఆప్ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీటు నుంచి అలాగే కల్కాజీ నుంచి సీఎం అతిషి పోటీ చేయనున్నారు. తుది జాబితా ప్రకటనతో ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ఆప్ ఖరారు చేసింది.
మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. 2025 ఫిబ్రవరిలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ప్రజాకోర్టు’ తీర్పు తర్వాత మాత్రమే తిరిగి ఆ పదవి చేపడతానని అన్నారు. అలాగే కాంగ్రెస్‌తో ముందస్తు ఎన్నికల పొత్తుకు అవకాశం లేదని తేల్చిచెప్పారు. సొంత బలంతోనే తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.