Delhi pollution : దీపావళి (Diwali) వేళ ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రమైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అనేక ప్రాంతాల్లో 280కి పైగా అధ్వాన్నంగా ఉంది. ఇది అధ్వాన్నస్థాయి కాలుష్య కేటగిరీ పరిధిలోకి వస్తుంది. వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) ఆందోళన వ్యక్తంచేసింది.
ఇక అక్షరధామ్ ప్రాంతంలో అయితే వాయు నాణ్యత ఏకంగా 426గా ఉంది. ఈ సీజన్లో ఢిల్లీలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని సీపీసీబీ వెల్లడించింది. ఆనంద్ విహార్ ప్రాంతం 418 ఏక్యూఐతో తర్వాతి స్థానంలో ఉంది. పెరుగుతున్న కాలుష్య స్థాయులను అరికట్టడానికి ఇండియా గేట్ వద్ద వాటర్ స్ప్రింక్లర్లను మోహరించినట్లు పీసీబీ అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతంలో ఇవాళ వాయు నాణ్యత 269గా నమోదైంది. ఢిల్లీలోని 38 వాయు పర్యవేక్షణ కేంద్రాలలో తొమ్మిది కేంద్రాల పరిధిలో ఇప్పటికే వాయు నాణ్యత అత్యంత పేలవమైన కేటగిరిలోకి వచ్చింది. ఆనంద్ విహార్‌లో (389), వజీర్పూర్ (351), జహంగీర్‌పురి (310), ద్వారక (310) ఏక్యూఐలతో అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.
శీతాకాలం గాలితో తేమ పెరగడం, వాహన ఉద్గారాలు పెరగడంవల్ల కాలుష్యం తీవ్రమైనట్లు కాలుష్య నియంత్రణ అధికారులు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయులు తీవ్రమైన జోన్లోకి ప్రవేశిస్తున్నందున నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. దీపావళి పండగ నేపథ్యంలో పెద్ద మొత్తంలో టపాసులు కాల్చడం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంవల్ల వాయు నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అంచనా వేసింది.