Supreme Court : ఢిల్లీ (Delhi), దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం (Air pollution) తీవ్రస్థాయిలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశరాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి రైతులను నిందించడం సరికాదని పేర్కొంది. పంట వ్యర్థాల దహనాన్ని (Stubble Burning) రాజకీయం చేయవద్దని, దాన్ని అహంకారానికి సంబంధించిన విషయంగా పరిగణించకూడదని వ్యాఖ్యానించింది.
పంట దహనం చేయకూడదంటే వ్యర్థాలను తొలగించడానికి వారి వద్ద యంత్రాలు కూడా ఉండాలని పేర్కొంది. ఢిల్లీ కాలుష్యం అంశాన్ని కాలానుగుణమైన అంశంగా పరిగణించలేమని తెలిపింది. కాలుష్య నివారణకు శాస్త్రీయ పరిష్కారాల కోసం ప్రయత్నాలు చేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM), కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కాలుష్య నివారణకు ఇప్పటివరకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ తీసుకున్న చర్యలవల్ల గాలి నాణ్యత ఎంతమేరకు మెరుగుపడిందనే విషయంపై వారంలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
వారి కార్యాచరణ ప్రణాళిక అసమర్థంగా ఉంటే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేసింది. కాలుష్యం విషయంలో ప్రతిసారి పంట వ్యర్థాల దహనాన్ని కారణంగా చూపడం సరైన చర్య కాదని సుప్రీంకోర్టు మందలించింది. రైతులపై నింద వేయడం అలవాటుగా మారిపోయిందని అసహనం వ్యక్తంచేసింది. కాలుష్యానికి గల ప్రధాన కారణం ఏదనే విషయాన్ని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
కాగా, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి వ్యర్థాల దహనం, వాహనాల ఉద్గారాలు, నిర్మాణ ధూళి, బయోమాస్ దహనం వంటి కీలక కారణాలపై వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించిందని, వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటుందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య న్యాయస్థానానికి తెలియజేశారు. ఢిల్లీలో శీతాకాలంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుందని, దీనికి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణమని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.