Firecrackers Ban | దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిపిందే. వాతావరణ కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ వరకు పటాకులపై నిషేధం విధించింది. దీపావళి సందర్భంగా రాజధానిలో క్రాకర్స్ కాల్చకుండా.. నిషేధాన్ని పకడ్బంధీగా అమలు చేసేందుకు ప్రయత్నం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 300 బృందాలను నియమించింది. ఆయా బృందాలు నగరంలో పర్యటిస్తూ బాణాసంచా కాల్చే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నాయి. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రూ.200 జరిమానా, ఆరు నెలల వరకు జైలుశిక్ష విధింవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. పటాకులు విక్రయించిన వారిపై సైతం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీలోని 23 ప్రదేశాలపై అగ్నిమాపకశాఖ నిఘా వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అగ్నిమాపక సిబ్బంది వాహనాల్లో పర్యటించనున్నారు.
ఈ జాబితాలో లజ్‌పత్ నగర్ (సెంట్రల్ మార్కెట్), సౌత్ ఎక్స్, తిలక్ నగర్, లాల్ కువాన్ చౌక్, లాహోరీ గేట్, నాంగ్లోయ్, సోనియా విహార్, మెహ్రౌలీ, ఘిటోర్ని మెట్రో స్టేషన్, అలీపూర్ పోలీస్ స్టేషన్, రాణి బాగ్ మార్కెట్, మంగోల్‌పురి డీటీసీ డిపో (కత్రాన్ మార్కెట్) ఉన్నాయి. గాంధీ నగర్ మార్కెట్, మహిపాల్పూర్ చౌక్, సంగం విహార్, ముండ్కా మెట్రో స్టేషన్, భాటి మైన్స్ రోడ్ డేరా విలేజ్ మోర్, ఆజాద్ మార్కెట్ చౌక్, జైపూర్ గోల్డెన్ హాస్పిటల్, న్యూ అశోక్ నగర్, యమునా విహార్, భాటి మైన్స్ వద్ద రాధా స్వామి సత్సంగ్‌తో పాటు రాణి ఝాన్సీ రోడ్, నెహ్రూ ప్లేస్, భికాజీ కామా ప్లేస్, రూప్ నగర్, లక్ష్మీ నగర్, గీతా కాలనీ, జామా మసీదు, సదర్ బజార్ తదితర ప్రాంతాల్లో అగ్నిమాక బృందాలు పర్యటించనున్నాయి. అయతే, సదర్ బజార్, తుర్క్‌మన్ గేట్, ఢిల్లీ గేట్, మయూర్ విహార్, ఇంద్రపురి, నజఫ్‌గఢ్, బదర్పూర్ సహా పలు ప్రాంతాల్లో వీధుల నుంచి ప్రధాన మార్కెట్ల వరకు రహస్యంగా పటాకులు కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో కూడా పటాకులు విక్రయించే పరిస్థితి నెలకొంది.
అయితే, వారిపై పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. చాలా మంది ప్రజలు ఘజియాబాద్, నోయిడా, సోనిపట్, రోహ్తక్, గురుగ్రామ్ మరియు ఫరీదాబాద్ నుంచి పటాకులు తెప్పించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. కాలుష్యం నుంచి ప్రజలను కాపాడేందుకు పటాకులపై నిషేధం తప్పనిసరి అని మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దీపావళి దీపాల పండుగను దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మనం ఇతరులకు ఉపకారం చేస్తున్నామని కాదని.. పటాకులు కాల్చడంతో వచ్చే కాలుష్యంతో మనం, పిల్లలు ఇబ్బంది పడతాం కాబట్టి మనకు మేమే ఉపకారం చేసుకుంటున్నామన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో అన్ని రకాల బాణాసంచా తయారీ, అమ్మకం, నిల్వ, కాల్చడంపై జనవరి 1 వరకు పూర్తి నిషేధం విధించింది. కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం ప్రకారం ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) ఈ ఆదేశాలను జారీ చేసింది. పటాకుల నిషేధంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిన విమర్శలు ఆయన కొట్టిపడేశారు. ప్రతి ఒక్కరి శ్వాస, ప్రాణం ముఖ్యమన్నారు.