ధర్మశాల, జనవరి 2 : ముగ్గురు తోటి విద్యార్థినులు, ఒక ప్రొఫెసర్ చేసిన ర్యాగింగ్, లైంగిక వేధింపులు తాళలేక డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థిని మృతి చెందిన ఘటన కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో వెలుగుచూసింది. మరణించే ముందు బాధిత విద్యార్థిని తన మొబైల్లో రికార్డు చేసిన వీడియోలో ప్రొఫెసర్ తనను అనుచితంగా ఎలా తాకాడో వివరించడంతో పాటు, క్యాంపస్‌లో, క్లాస్ రూమ్‌లో లైంగికంగా, మానసికంగా వారు తనను ఎలా వేధించింది తెలిపింది. ధర్మశాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న తన కుమార్తెను సెప్టెంబర్ 18న తోటి విద్యార్థినులు హర్షిత, ఆకృతి, కోమలికలు క్రూరంగా ర్యాగింగ్ చేశారని, అది ఎవరికీ చెప్పొద్దని బెదిరించారని మృతురాలి తండ్రి ఆరోపించారు.
నిందితుల్లో ప్రొఫెసర్ అశోక్ కుమార్ కూడా ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఈ వేధింపులతో తీవ్ర అస్వస్థతకు గురైన తన కుమార్తెకు పలు దవాఖానల్లో చికిత్స చేసినా ఫలితం లేదని, డిసెంబర్ 26న ఆమె మృతి చెందిందని తెలిపారు. దీనిపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారని, నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, తాను ర్యాగింగ్‌కు గురైనట్టు బాధిత విద్యార్థిని తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కాలేజీ ప్రిన్సిపాల్ రాకేశ్ పఠానియా తెలిపారు.